దేశంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ఎన్టిఆర్ స్మారక నాణెం..
హైదరాబాద్ (CLiC2NEWS): దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) పేరుమీద విడుదల చేసిన రూ. 100 నాణాలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం (ఇండియ గవర్నమెంట్ మింట్ ) చీఫ్ జనరల్ మేనేజర్ విఎఎస్ ఆర్ నాయుడు తెలిపారు. ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాల సందర్బంగా రూ. 100 నాణాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నాణాలు హైదరాబాద్లోని ఇండియ గవర్నమెంట్ మింట్ కాంపౌండ్లో తయారుచేశారు. ఈ నాణాలను విడుదల చేసిన రెండున్నర నెలల్లో 25 వేల నాణాల అమ్మకాలు జరిగాయని, ఇది దేశంలోనే సరికొత్త రికార్డు అని తెలిపారు.
దేశంలో 1964 నుండి స్మారక నాణాలను విడుదల చేయటం ప్రారంభమైంది. మొత్తం 200 స్మారక నాణాలు విడుదల చేయగా.. అప్పటినుండి ఇప్పటి వరకు ముద్రించిన వాటిలో 12వేలు వరకు మాత్రమే అమ్మకాలు జరిగినట్లు వివరించారు. తాజాగా ఎన్టిఆర్ స్మారక నాణెం 25 వేల అమ్మకాలతో రికార్డును సృష్టించిందని, అత్యధిక విక్రయాలతో ప్రథమ స్థానంలో ఉండటం సంతోషంగా ఉందని ఎన్టిఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టిడి జనార్థన్ అన్నారు.