జలమండలి నూతన ఎండిగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి నూతన ఎండిగా సి.సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన దానకిశోర్ నుంచి ఛార్జ్ తీసుకున్నారు.ఇప్పటి వరకు జలమండలి ఎండీగా పనిచేసిన దానకిశోర్.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతిపై వెళ్లారు. నూతన ఎండీకి జలమండలి అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి 2004 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లల్లో విధులు నిర్వర్తించారు. 2015 నుండి 2017 వరకు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2020 నుండి తెలంగాణలో బాధ్యతలు చేపట్టారు. తాజాగా జలమండలి ఎండిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక బదిలీపై వెళ్లిన మాజి ఎండి దానకిశోర్.. జలమండలి చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన మేనేజింగ్ డైరెక్టర్ గా రికార్డు సృష్టించారు. 2016 ఏప్రిల్ లో ఛార్జ్ తీసుకున్న ఆయన.. 2023 డిసెంబరు వరకు ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో.. ఐటీ, రెవెన్యూ, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారు. జలమండలికి అనేక అవార్డులు తీసుకొచ్చి బోర్డు ప్రతిష్ఠను మరింత పెంచారు.