జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
13 గేట్లు ఎత్తివేత
జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
13 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ :భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారగా, ప్రస్తుతం 1,36,595 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 1,043 అడుగుల నీరు నిల్వ ఉండగా, పూరిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.532 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి దిగువకు 1,37,509 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ నుంచి కూడా నీటి విడుదల
కృష్ణా నదికి వరద పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 42,378 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 556.70 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం సాగర్లో 248.29 టీఎంసీల నీరు ఉండగా, పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. ప్రాజెక్టుకు 42,378 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 4,107 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.