వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్‌

యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని, 15 రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రకటించారు.

సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్‌ను ఆదివారం ఫాంహౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్‌ తయారు చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.