రాములవారి రథానికి నిప్పుపెట్టిన దుండగులు

అనంతపురం (CLiC2NEWS): జిల్లాలోని కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలోని రామాలయంలో రథానికి దుండగులు నిప్పుపెట్టినట్లు సమాచారం. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో సిఎం చంద్రబాబు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఆలయ షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. అప్పటికే రథం కొంతమేర కాలిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్‌పి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయ షెడ్డు తలుపునకు ఉన్న తాళం కోసి లోపలికి వచ్చిన దుండగులు వస్త్రం చుట్టిన కర్ర సాయంతో నిప్పు పెట్టినట్లు తెలిపారు. ఆ గ్రామంలో ఉన్న వర్గ విభేదాల కారణంగానే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనా వేశారు.
గ్రామానికి చెందిన ఎర్రిసామి , హనుమంత రెడ్డి, గోపాల్ రెడ్డి, రామాంజనేయులు రెడ్డి సోదరులు 2022లో ఆలయానికి రథాన్ని చేయించారు. దానికి రూ. 20 లక్షలు ఖర్చు చేశారు.
పూర్వం నుండి ఆది పత్యం చెలాయిస్తున్న మరో వర్గానికి ఇది నచ్చక శ్రీరామనవమి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం. రథం చేయించిన వర్గం గ్రామస్థలు మన్నలను పొందుతుందనే అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అంచానవేశారు. ఈ వివరాలను సిఎంకు పోలీసులు వెల్లడించారు.