ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన.. విద్యార్థిని మృతి

కడప (CLiC2NEWS): పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. వైఎస్ ఆర్ జిల్లా బద్వేల్లో శనివారం పెట్రోల్ దాడికి గురైన దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని కడప రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. ఆదివారం ఆమె మృతి చెందింది. ఆస్పత్రిలో బాధితురాలి నుండి జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్ నిప్పంటించినట్లు తెలిపినట్లు సమాచారం.
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు.. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడికోసం గాలించారు. రాత్రి సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప శివారులో నిందితుడు విఘ్నేష్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి షర్షవర్ధన్ రాజు తెలిపారు. పథకం ప్రకారమే విఘ్నేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. బాలికకు , నిందితుడు విఘ్నేష్‌కు ఐదేళ్లుగా పరిచయం ఉంది. బాధితురాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. విఘ్నేష్ కడపలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతడు బాలికకు ఫోన్ చేసి తనను కలవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో బాలిక శనివారం అతనిని కలిసింది. ఇద్దరూ బద్దేలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంచురీ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక అడగడంతో విఘ్నేష్ పెట్రోల్‌పోసి నిప్పంటించాడని తెలిపారు. ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.