`శ్రీరాంసాగర్` నుంచి నీటి విడుదల

నిజామాబాద్ : ఈ మధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాలకు, అలాగే మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో బుధవారం ఉదయం నుంచి భారీగా వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నదని డీఈ జగదీశ్ తెలిపారు. ఉదయం7 గంటలకు 25వేల క్యూసెక్కుల వరద రావడంతో 8 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి వదిలినట్లు తెలిపారు. 9 గంటల నుంచి ఇన్ఫ్లో మరింత పెరగడంతో ఎస్కేప్ గేట్లను ఎత్తి గోదావరిలోకి 8 వేల క్యూసెక్కులను వదిలారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఇన్ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నాలుగు వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు మొత్తం 20,500 క్యూసెక్కుల వరద నీటివిడుదల కొనసాగుతుందని డీఈ తెలిపారు.