రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. మార్గదర్శకాలు విడుదల
నామినేషన్ ప్రాతిపదికన నియామకాలు
![](https://clic2news.com/wp-content/uploads/2024/08/Amaravati.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని సర్కార్ నిర్ణయించింది. నామినేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. సిఎం లేదా సిఎం కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ , సోషల్ స్టేటస్ ల ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించనున్నారు.
ఎపి రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. నామినేషన్ల ద్వారా అంబాసిడర్ల నియామకం జరగనుంది. వచ్చిన నామినేషన్లు నుండి నైపుణ్యం, అర్హత, స్తాయిల ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను సిఆర్డిఎ ఎంపిక చేస్తుంది. ఒక ఏడాది కాలానికి నియమించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వారి పనితీరు ఆధారంగా మరింత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎపి ఆర్ధిక అభివృద్ధిలో అమరావతి ప్రాజెక్టు, స్మార్ట్ సిటిగా అమరావతి దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలి. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం.. పెట్టుబడులు తీసుకు వచ్చేలా అంబాసిడర్లు పనిచేయాలి. దీని కోసం ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు , అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు, వర్క్ షాప్లు నిర్వహించాలి.. తద్వారా భాగస్వాములను, పెట్టుబడుదారులను ఆకర్షించాలని పేర్కొంది.