కానిస్టేబుల్‌ బాబ్జీపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి క్లియర్‌ చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్న అబిడ్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాజ్జీకి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే బాబ్జీపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తుండగా.. తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా బాబ్జీని అభినందించారు. ‘మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది.ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశావు.హ్యాట్సాఫ్ బాబ్జీ’ అంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

(ప‌రుగెడుతూ అంబులెన్స్‌కు దారి..)

అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్లో బాబ్జీ అనే వ్య‌క్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఎప్పుడు విప‌రీత‌మైన ట్రాఫిక్ ఉండే మొజంజాహీ మా‌ర్కెట్ వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో కోఠీ వెళ్లే మార్గంలో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవ‌డాన్ని చూసి ఆ వాహ‌నానికి దారి క్లియ‌ర్ చేశాడు. అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు ఆయ‌నే స్వయంగా వాహ‌నం ముందుగా ప‌రుగెడుతూ.. వెనుక అంబులెన్స్ ఉన్న విష‌యాన్ని వాహ‌న‌దారుల‌కు సూచిస్తూ ట్రాఫిక్ క్లియ‌ర్ చేశారు. దీంతో స‌కాలంలో అంబులెన్స్ ఆస్ప‌త్రికి చేరుకోవ‌డంతో అందులో ఉన్న వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్ కావ‌డంతో ఉన్న‌తాధికారులు కానిస్టేబుల్ ను మెచ్చ‌కుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కానిస్టేబుల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మీరూ.. ఓ లుక్కేయండి.. కానిస్టేబుల్ బాబ్జీని అభినందించండి.

 

Leave A Reply

Your email address will not be published.