కాలేజీలు తెరిచేందుకు యూజీసీ న్యూ గైడ్‌లైన్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌తో క్లాసు రూములు మూతపడ్డాయి. కాస్త పాజిటీవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పునఃప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో తిరిగి కాలేజీలు, యూనివర్సిటీలు తెరుచుకోవడానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్(యూజీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని.. దశల వారీగా విద్యా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. భౌతిక దూరంలో తరగతుల నిర్వహణకు ఆన్ లైన్ పద్దతిలో ప్రారంభానికి సంబంధించి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని సూచించింది. పూర్తిగా సిద్ధం అనుకున్న తర్వాతే కార్యకలాపాలను మొదలు పెట్టాలని స్పష్టం చేసింది.

మార్గదర్శకాలుః

  • ఆయా సంస్థల ప్రధాన అధికారుల నిర్ణయం మేరకు చివరి సంవత్సరం విద్యార్థులను విద్యా, నియామక ప్రయోజనాల కోసం చేరేందుకు అనుమతించవచ్చు.
  • మొత్తం విద్యార్థులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా హాజరుకాకుండా చూసుకోవాలి. అవసరమైతే షిఫ్టు వారిగా తరగతులను నిర్వహించాలి.
  • కొవిడ్-‌19 వ్యాప్తిని నివారణకు అవసరమైన మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలి.
  • ఆన్‌లైన్ తరగతులు ఇష్టపడే విద్యార్థుల కోసం బోధనా విధానం కొనసాగుతుంది. అందుకోసం సంస్థలు ఆన్‌లైన్ స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.
  • అవసరమైతే తప్ప విద్యార్థులు అధ్యాపకులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు. ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే అధ్యాపకులతో సంప్రదింపులు జరపాలి.
  • అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు, వీసా సంబంధిత సమస్యల కారణంగా తిరిగి విద్యాలయాల్లో చేరలేని అంతర్జాతీయ విద్యార్థుల కోసం విద్యాసంస్థలు ప్రణాళిక రూపొందించాలి. వారికి ఆన్‌లైన్ ద్వారా బోధన సాగించే విధంగా ఏర్పాట్లు చేయాలి.
  • భద్రత, ఆరోగ్య నివారణ చర్యలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన సందర్భాల్లో మాత్రమే హాస్టళ్లు తెరవాలి.
  • కొవిడ్‌ లక్షణాలు ఉన్న విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టళ్లలో ఉండటానికి అనుమతించకూడదు.
  • ఏదైనా క్యాంపస్ తిరిగి తెరిచే ముందు విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాన్ని ఆయా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతంగా ప్రకటించాలి.
  • కొవిడ్‌-19 దృష్ట్యా భద్రత, ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు, సూచనలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులను ఉన్నత విద్యాసంస్థలు తప్పక పాటించాలి.
Leave A Reply

Your email address will not be published.