అనిశా వలలో నీటి పారుదల శాఖ ఈఈ..

కరీంగనర్ (CLiC2NEWS): రాజన్న సిరిసిల్ల నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అమరేందర్ రెడ్డి రూ.60వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులకు చిక్కారు. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల కిందట సిరిసిల్ల జిల్లాలోని అవునూరు, అగ్రహారం గ్రామాల మధ్య చెక్‌డ్యాం నిర్మాణానికి మొత్తం రూ.8 కోట్లకు పని చేపట్టేందుకు హనుమకొండకు చెందిన ఓ గుత్తేదారు అనుమతి తీసుకుని దానిని పూర్తి చేశారు. ఆ గుత్తేదారు ఏడాది కిందట మొదటి విడతగా రూ.5 కోట్ల బిల్లు చెల్లింపులు కోసం సిరిసిల్ల నీటిపారుదల శాఖ డివిజన్-7 ఈఈగా పనిచేస్తున్న అమరేందర్ రెడ్డికి దరఖాస్తు చేసుకొని బిల్లులు సమర్పించారు. ఆ బిల్లు చెల్లింపు సందర్భంగా అమరేందర్ రూ.4లక్షలు లంచం తీసుకున్నాడు. ప్రస్తుతం మరో రూ.50 లక్షల బిల్లు కోసం గుత్తేదారుని రూ.లక్ష లంచం ఇవ్వాలని అమరేందర్ డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేననగా రూ.75వేలకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి అమరేందర్ నివాసంలో రూ.60వేలు లంచం తీసుకున్నాడు. ఈ క్రమంలో అనిశా అధికారులు తనని పట్టుకుంటారనే సమాచారంతో ఆ డబ్బును అమరేందర్ .. తన కుమారుడి టి షర్ట్‌లో చుట్టి ఇంటి వెనుకవైపుకు విసిరేశాడు. అతని ఇంట్లో ఉన్న సిసిటివి పుటేజి ఆధారంగా అమరేందర్‌ను పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు.