సింగరేణి కార్మికులకు తీపి కబురు.. దీపావళికి భారీ బోనస్

మంచిర్యాల: సింగరేణి యాజమాన్యం కార్మికులకు శుభవార్త అందించింది. ఏటా మాదిరే దీపావళి బోనస్‌తో ఈసారి సింగరేణి కార్మికులు పండుగ చేసుకోనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్ఆర్) బోనస్‌ను చెల్లించేందుకు నిర్ణయించినట్లు శనివారం సింగరేణి ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా రూ.68,500 బోనస్ చెల్లించనున్నట్లు అందులో తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్‌లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో చెప్పింది. ఈ పీఆర్ఎస్ బోనస్ నాన్ ఎగ్జిక్యూటివ్, పదో వేజ్ బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని తెలిపింది సింగరేణి సంస్థ. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం తో మాట్లాడి ఒప్పించిన టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితకి, టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావుకి, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.