కర్ణాటకలో బీజేపీ ముందంజ

బెంగళూరు : దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఒక్కసారిగా ఉప ఎన్నికలపై వాడీవేడి చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభకావడంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీహార్‌లోని 243 స్థానాలతోపాటు మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు, గుజరాత్‌లో 8 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాలు, మరో 8 రాష్ట్రాల్లో కలిసి 15 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం. 8 గంటలకు ప్రారంభమైంది. బీహార్‌లో ఎన్డీఏ, ఆర్జేడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఫలితంపై దేశవ్యాప్తంగా ప్రజలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కర్ణాటకలో రెండు శాసనసభ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఆర్ఆర్ నగర్(రాజరాజేశ్వరి నగర్), సిరా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ఆ రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆర్ ఆర్ నగర్ నుంచి ఎన్ మునిరత్న బరిలో ఉండగా, సిరా నుంచి రాజేశ్ గౌడ పోటీలో ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు ఓట్ల లెక్కింపు చూస్తే.. మునిరత్న 9,950 ఓట్ల మెజార్టీతో లీడ్‌లో ఉండగా, రాజేశ్ గౌడ 1,202 ఓట్ల మెజార్టీతో అధిక్యంలో ఉన్నారు. ఆర్ ఆర్ నగర్‌లో కాంగ్రెస్ రెండో స్థానంలో, జేడీఎస్ మూడో స్థానంలో ఉంది.