నోటి నుంచి దుర్వాసన

నోటి నుంచి దుర్వాసన

మనం మేల్కొని ఉన్నంతసేపూ లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. నిద్రపోయేటపడు మాత్రం దీని విడుదల నిలిచి పోతుంది. ఈ కారణంచేత నోటి కుహరాన్ని ఆవరించి ఉండే శ్లేష్మపు పొర నిద్రించే సమయాల్లో పొడిగా తయారవుతూంటుంది. తడి ఇంకి పోవటం మూలాన శ్లేష్మపు పొరపైనుండే నిర్జీవ కణాలు విడివడి, విచ్ఛిన్నమై ఒక ప్రత్యేకమైన వాసనను వెలువరిస్తాయి. ఎక్కువ సమయం పాటు నిద్రపోయినపడు నోరు తాజాతనాన్ని కోల్పోవటానికి కారణం ఇదే. ఇలాగే నోటి దుర్వాసన కారణంగా నలుగురి మధ్యకు రాకుండా ముడుచుకుపోవాల్సిన పనిలేదు. సరైన కారణాన్ని కనుగొని తదనుగుణంగా చికిత్స తీసుకుంటే దీన్నుంచి తేలికగా బయట పడవచ్చు.
నోటి నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, నోటి పరిశుభ్రత లోపించటం, దంతక్షయం, చిగుళ్ల వ్యాధి వంటివి దుర్వాసనకు కొన్ని కారణాలు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరించటం తప్పనిసరి అయింది. మరి అలా మాస్కు ధరించిన సమయంలో నోటి నుంచి దుర్వాసన తెలుస్తుందా? దానిని నివారించడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
సోంపు : దీన్లోని యాంటీ-సెప్టిక్‌ లక్షణాలు చెడు శ్వాసను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఒక టేబుల్‌ స్పూన్‌ సోంపు, నోటిలో వేసుకొని నమలడం వల్ల నోరు ఫ్రెష్‌ అవుతుంది.
దాల్చిన చెక్క : ఇందులో ఆల్డిహైడ్‌ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను తొలగిస్తుంది. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి కొద్దిగా నీటిలో వేసి మరిగించాలి. చల్లబడిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
నిమ్మకాయ : నిమ్మకాయ ముక్కను నోటిలో వేసి నమలడం ద్వారా నోరు ఫ్రెష్‌ అవుతుంది. నిమ్మ తొక్క నోటిని శుభ్రం చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్‌ ఆమ్లం నోటి దుర్వాసనతో పోరాడుతుంది.
లవంగం : ఇందులోని యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు నోటిని రిఫ్రెష్‌ చేస్తాయి. మీ నోటిలో కొన్ని లవంగాలను నమలడం ద్వారా చెడు శ్వాసను వదిలించుకోవచ్చు. లేదా లవంగం టీని మౌత్‌ వాష్‌గా ఉపయోగించవచ్చు.
నీరు : రోజూ పుష్కలంగా నీరు తాగడం ద్వారా కూడా నోరు రిఫ్రెష్‌ అవుతుంది. అలాగే, మీ నోటిని చల్లటి నీటితో తరచుగా కడగడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.
అలాగే…నీటిని నోటిలోనికి తీసుకుని లోపల బంధించిన గాలి సహాయంతో మూలమూలలకూ పంపించి నోటిని శుభ్రపరుచుకోవటమే గండూషమంటే. దీని వలన ముఖం తాలూకు కండరాలన్నిటికీ వ్యాయామం లభిస్తుంది. గండూషాన్ని సాధ్యమైనంత ఒత్తిడిని ప్రయోగిస్తూ చేస్తే దంతాల మధ్య ఇరుక్కున్న చిన్న చిన్న ఆహారపు కణాలన్నీ బైటకు వచ్చేస్తాయి. చాలా చిన్న విషయంలాగా ఇది కనిపించినప్పటికీ, ఈ సూచనను పాటిస్తే మీ దంతాలెప్పటికీ క్షయానికి గురికావు. అలాగే నోటి దుర్వాసననుండి బైట పడగలుగుతారు. ఏ కారణంచేతనైనా గండూషాన్ని చేయడం కుదరకపోతే కనీసం ఏలక్కాయనో, లవంగాన్నో బుగ్గన పెట్టుకుని నములుతుండాలి. ఇవి లాలాజలాన్ని అధికంచేసి వ్యర్థపదార్థాలను వెలువరించడంలో సహాయపడతాయి. అలాగే నోటిని తాజాగా ఉంచుతాయి.

Leave A Reply

Your email address will not be published.