ఆ ఆలయద్వారానికి తాళాలు వేసి మొక్కులు చెల్లిస్తారు

వారణాసి: దేవుడికి మొక్కుగా తలనీలాలు అర్పించడం, బంగారం, వెండి కానుకలు ఇవ్వడం వంటివి సహజమే. కానీ పురాతన ఆలయాలకు ప్రసిద్ధిగా నిలిచిన ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ఆలయంలో ద్వారాలకు తాళాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వారణాసిలోని దశశ్వమేధ్ ఘాట్ సమీపంలో ఉన్న బందీ దేవి ఆలయాయనికి చాలా ప్రత్యేకతలున్నాయి. అక్కడి అమ్మవారికి మొక్కులు చెల్లించే వారంతా ఆలయ ద్వారాలకు తాళాలు వేస్తారు. తాళం చెవిని వారే తీసుకెళ్తారు. ఇలా చేస్తే కష్టాల నుంచి బయటపడతారని, జీవితం ఆనందంగా సాగుతుందని వారి నమ్మకం. ఒక వేళ వారి కోరికలు తీరితే.. భక్తులు ఆలయ ద్వారానికి వేసిన తాళాన్ని తీసి దాన్ని గంగానదిలో విసిరేస్తారు. సహజంగా ఈ ఆలయంలో మంగళ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రుల ఉత్సవాల్లో భక్తులు తండోపతండాలుగా దేవీ దర్శనానికి విచ్చేస్తుంటారు. త్రేతాయుగం నుంచే బందీ దేవి తన భక్తులను కాపాడుతోందని అక్కడి ప్రజలు భావిస్తుంటారని ఆలయ పూజారి సుధాకర్ దుబే తెలిపారు.