పెండ్లికి 50 మందికే అనుమతి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. రోజురోజుకి ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్నాయి. రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయడం కోసం అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే వివాహ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్య విషయంలో పరిమితిని సైతం తగ్గించింది. ఇప్పటివరకు వివాహ వేడుకల కోసం 200 మందికి అనుమతి ఉండగా ఇప్పుడు దాన్ని 50కి కుదించింది. ఢిల్లీలోని మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ హాట్స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పెండ్లిళ్లు, ఇతరత్రా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు పంపగా బుధవారం ఆయన వాటికి ఆమోద ముద్రవేశారు.