60 డివిజన్లలో ‘జనసేన’ పోటీ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. మొత్తం 150 డివిజన్లలో 60 స్థానాల్లో అభ్యర్థులను నిలపనుంది. రెండు నెలలుగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ అధిష్ఠానం.. గెలుపుగుర్రాలకు టికెట్లు ఇవ్వనుంది. అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసిన నాయకులు గురు, శుక్రవారాల్లో వారితో నామినేషన్లు వేయించనున్నారు. ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారపు రాజలింగం తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు గెలిచే అభ్యర్థులను మాత్రమే గుర్తించి టికెట్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు.