రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు.

కర్నూలు : తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది ఏపీ ప్రభుత్వం. నవంబర్ 20 వ తేదీ నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలకు సంబంధించిన ముహుర్తంను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు కేటాయించింది. తుంగభద్ర నదీ పరివాహ ప్రాంతాల్లో 21 ఘాట్లను ఏర్పాటు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పుష్కరాలు జరిగేలా ఏర్పాట్లు చేసింది.
పుష్కరాలను విజయవంతం చేయడానికి కర్నూలు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తుంగభద్ర పుష్కరాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి రోజు (శుక్రవారం) సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్కరాల్లో పాల్గొననున్నారు. సంకల్బాగ్ ఘాట్ వద్ద మధ్యాహ్నం వైఎస్ జగన్ ఈ పుష్కరాలను ప్రారంభించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లను నిర్వహించారు. కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లను చేపట్టారు. తుంగభద్ర పుష్కరాలను పురస్కరించుకుని కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
23 పుష్కర ఘాట్లు..
తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం పొడవునా 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కర్నూలు సిటీ పరిధిలో.. మాసా మసీద్ (పంప్ హౌస్), సంకల్బాగ్, నాగసాయి ఆలయం, రాంభొట్ల ఆలయం, రాఘవేంద్ర మఠం, సాయిబాబా ఆలయం, నగరేశ్వర స్వామి ఆలయాల వద్ద పుష్కర ఘాట్లను నిర్మించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. గుండ్రేవుల, సుంకేశుల, పంచలింగాల, మునగాలపాడు, గొందిపర్ల వద్ద ఘాట్లు అందుబాటులో ఉన్నాయి. మంత్రాలయం పరిధిలో.. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో రెండు పుష్కర ఘాట్లను నిర్మించారు. ఎన్ఎపి పంప్ హౌస్, సంత మార్కెట్, వినాయక ఆలయం వద్ద ఘాట్లు అందుబాటులో తెచ్చారు. రాంపురం, మైలిగన్నూర్, కౌతాళం, కాచపురాల్లో ఘాట్లు నిర్మించారు. ఎమ్మిగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. నాగులదిన్నె రైల్వే బ్రిడ్జి, నాగులదిన్నె విలేజ్, గురుజాలల్లో ఘాట్లు ఉన్నాయి. నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో.. కొత్తపల్లి – సంగమేశ్వరం వద్ద ఘాట్‌ను నిర్మించారు. ఇదే చివరి ఘాట్. అన్ని ఘాట్ల వద్దకు యాత్రికులను తరలించడానికి ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులను నడిపించనున్నారు.