మాస్క్ పెట్టుకోకుంటే రూ.2 వేలు జరిమానా..
న్యూఢిల్లీ: తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి… దీంతో.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇవాళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీలో “కరోనా” వ్యాప్తి, నివారణ చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. “కరోనా” వ్యాప్తిపట్ల ముఖ్యమంత్రి కేజ్రీవాల్, వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతతరుణంలో “కరోనా”వ్యాప్తిని నివారించాలంటే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారిపై రూ.2 వేలు జరిమానా విధించనున్నారు. గతంలో రూ.500 ఉన్న ఫైన్‌ను ఏకంగా రెండు వేలకు పెంచేశారు. కరోనా కలవరం నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్.. అఖిల పక్ష పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాస్క్ ధరించని వారికి రెండు వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. కేసులు పెరుగుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయారని.. ఇవాళ హైకోర్టు కూడా కేజ్రీ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొరడా రుళుపించింది.
కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, ఇప్పుడు రాజకీయాలకు తావు లేదని, ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజల క్షేమం కోసం పనిచేయాలని సీఎం అన్నారు. అందరం ఒక్కటిగా మారి ప్రజలకు సేవ చేయాలని అన్ని పార్టీలు అంగీకరించినట్లు సీఎం కేజ్రీ తెలిపారు. చాత్పూజను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, కానీ ఒకేసారి కొలనులోకి వందల మంది వస్తే, దాంట్లో ఒక్కరికి కోవిడ్ ఉన్నా, అప్పుడు సంక్రమణ వేగంగా ఉంటుందన్నారు. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి జోరుగా సంక్రమిస్తోందని, కానీ చాత్పూజ సంబరాలకు మాత్రం జనం వందల సంఖ్యలో ఒకేసారి కొలనులోకి వెళ్ల కూడదని, ఇంట్లోనే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు.