గ్రేటర్‌లో గెలిచేది గులాబీ పార్టీయే

హైదరాబాద్: గ‌్రేటర్‌లో `కారు` ప్రచార జోరు పెంచింది. బల్దియాపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయే నని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ది స్పష్టం చేశారు. వందకు పైగా డివిజన్ లలో టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో అపార్ట్మెంట్, కాలనీ సంక్షేమ సంఘాలతో వ్యక్తిగత సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ప్రగతికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.