అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
మంచిర్యాల: జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించి నంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల పరిధిలో డంపింగ్ యార్డు, వైకుంఠధామం (శ్మశానవాటిక) తప్పనిసరిగా ఉండేందుకు అవసరమైన కార్యచరణతో ప్రణాళికబద్దంగా పనులు త్వరగా పూర్తి చేయాలని చూసించారు. బయో ఫెన్సింగ్, నర్సరీలకు గేట్లు, వాటి సంబంధిత పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.