రైతులను ఆదుకోండి..

నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్ 

అవ‌నిగ‌డ్డ‌: నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు అవనిగడ్డ నియోజకవర్గం లో జనసేన పార్టీ అధినేత పవన్ క‌ళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పంటపొలాలను ఆయన పరిశీలించారు. మోపిదేవి మండలం పరిధిలోని పెదప్రోలులో పంట పొలాలను పరిశీలించి అన్నదాత లతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అసెంబ్లీలో తిట్టుకోవడం కాదు అన్నదాత గురించి చర్చలు జరగాలని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన రైతన్నలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పవన్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సార్లు వరుసగా పంటనష్టం జరిగిందని అందరికీ అన్నం పెట్టే అన్నదాత అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాడని రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని వెల్లడించారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వారిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు నష్టపరిహారం ఎంత ఇస్తారు అనే విషయం ప్రభుత్వం ముందు తెలపాలని ఆయన అన్నారు. కౌలు రైతుల పట్ల అన్యాయం జరిగితే జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పవన్ హెచ్చరించారు. అనంతరం పులిగడ్డ మీదుగా గుంటూరు జిల్లాకు వెళ్లారు.. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు ర్యాలీలో పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.