నాగార్జున సాగర్ నిండుకుండ!
నాగార్జునసాగర్: భారీ వర్షాల మూలంగా వచ్చిన వరద నీటితోనాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా కళకళలాడుతూఉంది. ప్రస్తుతం సాగర్‌లోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ పూర్తిస్థాయి సామర్ధ్యం 312 టిఎంసీలు కాగా ఇప్పటికే 285 టిఎంసీల నీరు చేరింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 575 అడుగుల వద్దకు నీరు చేరింది. 585 అడుగులకు నీరు చేరుకుంటే గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మధ్నాహ్నం నాటికి గేట్లు ఎత్తివేసే అవకాశముంది. కాగా పైనుంచి వరద ప్రవాహం ఇంకా ఉధృతంగానే ఉంది. శ్రీశైలంలోకి 4.17 లక్షల క్యూసెక్యుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలంకు పైన ఉన్న ఆలమట్టి డ్యామ్‌కు రెండు లక్షల 59 వేల క్యూసెక్యుల వరద వస్తోంది. దీంతో మరో వారం రోజుల పాటు సాగర్‌లోకి అధికంగా వరద ప్రవాహం ఉండే పరిస్థితి ఉంది. సాగర్ దిగువన కూడా కృష్ణా నదిలోకి వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని కృష్ణానది పరివాహాక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంత గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.