జాడ‌తెలియ‌ని ఆ 9 మంది

4 ఫైర్ ఇంజ‌న్ల‌తో సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు... మ‌రో మూడు గంట‌ల్లో మంట‌లు అదుపులోకి వ‌చ్చే అవ‌కాశం

నాగ‌ర్‌కర్నూలు : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న సుమారు 20 మంది ఉద్యోగుల్లో 9 మంది బయటకు రాలేక పవర్‌ హౌజ్‌లోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు, అక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు సహాయక చర్యలు కనసాగుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు ఫైర్‌ ఇంజన్లతో ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చేందుకు మరో మూడు గంటలు పట్టొచ్చని ఫైర్‌ సిబ్బంది తెలిపారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది క్షేమంగా ఉన్నారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. స్పాట్‌ నుంచి చాలా దూరం వరకు వెతికామని, ఎవరూ కనపడలేదని, శబ్దాలు కూడా వినబడలేదని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఇప్పటికీ గుర్తించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రమాదంలో గాయపడిన ఆరుగురు ఈగల పెంటలోని జెన్‌కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అధునాతన పరికరాలతో ఆపరేషన్‌ మొదలెట్టిన సిఐఎస్‌ఎఫ్‌ రెస్క్యూ టీం
ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ డిజి విజ్ఞప్తితో 35 మందితో కూడి సిఐఎస్‌ఎఫ్‌ రెస్క్యూటీం శ్రీశైలం చేరుకుంది. ఆధునాతన పరికరాలతో కమాండెంట్‌ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం పవర్‌ హౌజ్‌లోకి వెళ్లి ఆపరేషన్‌ మొదలుపెట్టింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డిజి సివి ఆనంద్‌ తెలిపారు.

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ప్ర‌మాదంలో చిక్కుకుపోయిన‌వారు క్షేమంగా తిరిగి రావాల‌ని ఆకాంక్షించారు. విద్యుత్ కేంద్రం వ‌ద్ద ఉన్న‌ మంత్రి జగ‌దీశ్ రెడ్డి, సీఎండీ ప్ర‌భాక‌రావ్, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, అధికారుల‌ను అడిగి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ప్ర‌మాద ఘ‌న‌ట‌న‌పై మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు.

Leave A Reply

Your email address will not be published.