మాజీ మంత్రి కమతం రామిరెడ్డి కన్నుమూత
హైదరాబాద్ : తెలంగాణాకు చెందిన టిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (83) కన్నుమూశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లోనే రాజకీయాలు చేసిన రామిరెడ్డి, 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బిజెపి లో చేరారు. అప్పటి టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పరిగి నుంచి ఆయన అసెంబ్లీ కి పోటీ చేశారు. ఆయన అప్పుడు మూడో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. 2018 ఎన్నికల సమయానికి రామిరెడ్డిని బిజెపి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక ఆయన కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ లో చేరారు. ప్రస్తుతం రామిరెడ్డి వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా వారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశారు. ఈ మాజీ మంత్రి వయోభారంతో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది.