ఏలూరుకు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి బృందం

ఏలూరు: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు పరిసరాల్లో ప్రజలు గ‌త కొద్ది రోజులుగా తెలియ‌ని వ్యాధి బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరింది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు,222 మంది మహిళలు ఉన్నారు. పెస్టిసైడ్, ఇ–కోలి పరీక్షల రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. అధికార యంత్రాంగం మొత్తం ఏలూరులోనే మోహరించి వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి బృందం సైతం ఏలూరుకు చేరుకుంది.

డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్ మాట్లాడుతూ.. ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను దేశంలోని అనేక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య తగ్గడమే కాక డిశ్చార్జిల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బృందాలు వచ్చి నమోదు అయిన కేసుల వివరాలు తెలుసుకుని శాంపిల్స్‌ సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాక డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు వచ్చారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.