జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు..

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో అతి వేగంతో వచ్చిన ఓ కారు జిలేబీ తయారీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. షాపులో పనిచేస్తున్న నలుగురిపై వేడి నూనె మీదపడి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు బీభత్సానికి భయంతో స్థానికులు పరుగులు తీశారు. కారు దుకాణాల వైపు దూసుకొస్తుండటాన్ని గుర్తించిన అక్కడున్న వారు పక్కకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. కారు బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని కారు నడిపిన మహిళ పేర్కొంది. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో కారు నడిపిన మహిళ లొంగిపోయింది. పోలీసులు కారును సీజ్ చేసి ఘటనకు గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నారు.