రేపు పోలవరం వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రాజెక్టు పర్యటనలో భాగంగా సీఎం పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై సాగునీటిశాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్ సమీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా ఉంటుందన్నారు. అలాగే, 2022 ఖరీఫ్‌కు పోలవరం నీళ్లిస్తామని చెప్పారు. అయితే పోలవరం పూర్తి చేసేందుకు ఇంకా 37 వేల 885 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్న సీఎం జగన్ నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిన అంచనాల మేరకు కేంద్రం నుంచి నిధులను తెచ్చుకునేందుకు ఢిల్లీకి మంత్రుల బృందాన్ని కూడా పంపారు. ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడంపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు మంత్రులు తెలిపారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలించాలని షెకావత్‌ను కోరగా 15 రోజుల్లోగా వస్తానని షెకావత్ చెప్పారని వెల్లడించారు.