ఉద్యోగాల భర్తీ పర్యవేక్షణకు ప్రత్యేక సెల్
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎస్ సోమేశ్‌కుమార్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక కసరత్తు వేగవంతమైంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రకటించారు. అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను వెంటనే తేల్చాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఉపాధ్యాయ, ఇతర విభాగాల్లో 50 వేలకుపైగా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం బీఆర్కే భవన్లో వివిధశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా అన్నిశాఖల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో వేగంగా సమర్పించాలని సూచించారు.
ఈ వివరాలను క్రోడీకరించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నియామకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎస్ ప్రకటించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రారామచంద్రన్, శాంతికుమారి, రాణికుముదిని, ముఖ్యకార్యదర్శులు సునీల్‌శర్మ, రజత్‌కుమార్, జయేశ్‌రంజన్, రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.