2, 3వ తరగతుల విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడి లైంగికదాడి

లక్ష్మీదేవిపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): అభం శుభం తెలియని అమాయక చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. పాఠాలు చెప్పాల్సిన సారే పనికిమాలిన పనులు చేస్తున్నాడు.. ఈ ఘటన లక్ష్మీదేవిపల్లి మండంలోని చింతవర్రె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది.
కరోనా మహమ్మారి దెబ్బతో గత నాలుగైదు నెలల నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మొదలైన విషయం తెలిసిందే. అయితే చింతవర్రె పాఠశాల హెడ్మాస్టర్ దొడ్డ సునీల్ రోజు విడిచి రోజు పాఠశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో 2, 3వ తరగతి చదువుతున్న అమ్మాయిలను పాఠశాలకు పిలిపించుకుని.. ఆన్లైన్ క్లాసులు వింటున్నారా? లేదా? అని అడిగేవాడు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి పాల్పడేవాడు. అలా ఐదు మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు, డీఈవోకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.