20వేల పోలీస్ కొలువులు!
త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధశాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. నోటిఫికేషన్ జారీచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు పోలీస్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. వివిధ ర్యాంకులు, విభాగాల్లో దాదాపు 20వేల వరకు పోస్టులు భర్తీ చేసేందుకు పోలీస్‌శాఖ ఏర్పాట్లుచేస్తున్నది. పోలీస్‌శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించి, నివేదికను సమర్పించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- 19,299 కానిస్టేబుల్ పోస్టులు
- 425 ఎస్సై ఉద్యోగాలు ఖాళీ
సివిల్ ఎస్సై పోస్టులు 368 ఖాళీగా ఉన్నాయి. ఏఆర్‌లో 29, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో నాలుగు, స్టేట్ సీపీఎల్‌లో ఆరు, ఐటీ కమ్యూనికేషన్లో 18.. మొత్తం 425 ఎస్సై పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని పోలీస్‌శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. అదేవిధంగా ఐటీ కమ్యూనికేషన్లో మూడు డీఎస్పీలు, ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఐదు, సైంటిఫిక్ అసిస్టెంట్ 12, ల్యాబ్ టెక్నీషియన్లు నాలుగు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. సివిల్ డీఎస్పీల ఖాళీలపైనా ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. జిల్లా పోలీస్ కార్యాలయాల్లో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా అన్ని ఉద్యోగాలు కలిపి పోలీస్‌శాఖలో దాదాపు 20వేల వరకు పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్టు పోలీస్‌శాఖ ప్రభుత్వానికి తెలిపినట్టు సమాచారం.