హథ్రాస్ ఘటనలో అత్యాచారం నిజమే
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం రేపిన హథ్రాస్ అత్యాచార ఘటన పట్ల ఇవాళ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దళిత యువతిని నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొన్నది. యూపీలోని హథ్రాస్ కు చెందిన ఓ దళిత బాలికపై సెప్టెంబర్ 14వ తేదీన ఉన్నత కులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసినదే. నిందితులపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. హథ్రాస్‌లోని ఓ కోర్టులో సీబీఐ తన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. అయితే ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు విడిచింది. సెప్టెంబర్ 30వ తేదీన ఆమె మృతదేహానికి పోలీసులు అర్థరాత్రి పూట దహన సంస్కారాలు నిర్వహించారు. రాత్రికి రాత్రే దహన సంస్కారాలు నిర్వహించడం పట్ల దేశవ్యాప్త ఆందోళనలు చెలరేగాయి. కానీ ఆ సంస్కారాలు కుటుంబ సభ్యుల ఇష్టం మేరకే జరిగినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఘజియాబాద్ యూనిట్ కు చెందిన సీబీఐ అధికారులు నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గాంధీనగర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పలురకాల ఫోరిన్సిక్ పరీక్షలు నిర్వహించారు. అత్యాచార ఘటన అనంతరం తొలుత బాధితురాలు చికిత్స పొందిన జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, హస్పిటల్ వైద్యులను విచారించారు. అలాగే బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఛార్జిషీటును దాఖలు చేశారు.