ఆ రాష్ట్రాల‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల్లో కొత్త వ్య‌క్తుల‌ను పార్టీ అధ్య‌క్షులుగా నియ‌మించాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యానికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక, గుజ‌రాత్‌లోనూ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ అక్క‌డి పీసీసీ చీఫ్‌ అమిత్ చ‌వ్దా ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. దాంతో ఈ రెండు రాష్ట్రాల‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం అనివార్యంగా మారింది. వీటితోపాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌ల్లోనూ కొత్త పీసీసీ అధ్య‌క్షుల‌ను నియ‌మించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించింది. ఎందుకంటే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాజీ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్ సీఎల్పీ నేత‌గా ఉండ‌టంతోపాటు, పీసీసీ అధ్య‌క్షుడిగా కూడా కొన‌సాగుతున్నారు. అదేవిధంగా మ‌హారాష్ట్ర‌లోనూ బాలాసాహెబ్ థొరాట్ సీఎల్పీ నేత‌గా, పీసీసీ చీఫ్‌గా ఉభ‌య ప‌ద‌వుల్లో ఉన్నారు. దీంతో ఆ ఇద్ద‌రిని సీఎల్పీ నేత‌లు కొన‌సాగిస్తూ పీసీసీ చీఫ్ ప‌ద‌వుల‌ను ఇత‌రుల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ యోచిస్తున్న‌ది. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కొత్త పీసీసీ చీఫ్‌లుగా అసంతృప్తుల‌కే అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.