అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు రాత పరీక్షతోనే భర్తీ?

ఉన్నత విద్యామండలి యోచ‌న.. త్వరలో ఉమ్మడి నోటిఫికేషన్‌!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని 11 వ‌ర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని, ఇందుకు రాతపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తున్నది.

ప్రభుత్వం అనుమతిచ్చిన 1,061 పోస్టుల భర్తీకి కేంద్రీకృత విధానంలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని యోచిస్తున్నారు. రెండో దశలో మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లను ఆదేశించారు.

మంగళవారం నాంపల్లిలోని రాష్ట్రీయ ఉచత్తర్‌ శిక్షా అభియాన్‌ కార్యాలయంలో 11 వర్సిటీల వీసీలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోస్టుల భర్తీపై 3 రకాల ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిసింది. పోస్టుల భర్తీ యూనివర్సిటీల చేతుల్లో పెట్టరాదని, బీహార్‌ తరహాలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ లేదా టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టాలని వీసీలంతా అభిప్రాయపడ్డట్టు సమాచారం. రాతపరీక్ష నిర్వహణపైనా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. ఈ అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రభుత్వం అనుమతినిచ్చిన మేరకే నిర్ణయాలుంటాయని ఓ అధికారి చెప్పారు.

ఈ సమావేశంలో ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, వీసీలు ఎస్‌ మల్లేశం, రవీందర్‌, తాటికొండ రమేశ్‌, రవీందర్‌గుప్తా, కిషన్‌రావు, కట్టా నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, కవిత దర్యాని, సీతారామారావు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.