ఉనికిని చాటుకునేందుకే ప్రయత్నాలు..
మండపేట (CLiC2NEWS): తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును పోలీసులు అరెస్టు పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పందించారు. రెండ్రోజుల క్రితం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయ లబ్ధిని పొందేందుకూ మాత్రమే ఎమ్మెల్యే కుయుక్తులు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ఇటువంటి చిల్లర వ్యవహారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరు ఇది కాదన్నారు. ఆయనకు నిజంగా ప్రజల కోసం పనిచేయాలన్న కాంక్ష ఉంటే ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించరన్నారు. ద్వారపూడి మండపేట రోడ్డు పరిస్థితిపై అన్ని విషయాలు ఆయనకు తెలుసన్నారు. ఓ పక్క రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభానికి అనుమతులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ద్వారపూడి మండపేట రోడ్డు పనులు కూడా ప్రారంభించామని చెప్పారు. స్థానిక మెహర్ బాబా ఆశ్రమం వద్ద రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి ఎక్స్ కవేటర్లతో పనులు చేస్తుంటే ఎమ్మెల్యే కళ్ళకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు.
రెండ్రోజులుగా ద్వారపూడి మండపేట రోడ్డు పనులు జరుగుతుంటే కొత్తగా తానేదో వచ్చి ఉద్దరించానని చెప్పుకోవడానికి ఎమ్మెల్యే వేసిన పథకంలో నేడు పన్నిన ఎత్తుగడ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం అన్ని పనులు సక్రమంగా పని చేయడానికి చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. తమ ప్రభుత్వానికి ప్రచారంతో పని లేదని ప్రజా సమస్యల పరిష్కారమే గురిగా ఉందని ఈ సందర్భంగా తోట స్పష్టం చేశారు.
తప్పకచదవండి:ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్టు..