ఎన్‌కన్వెన్షన్ కూల్చివేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తున్నారు: బండిసంజయ్

సిరిసిల్ల (CLiC2NEWS): నేత కార్మికుల కరెంట్ బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మోసం చేశాయని.. నేత కార్మికులకు 50% సబ్సిడీ ఇస్తామని చెప్పి రెండు పార్టీలు మాట తప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఊరగొండ రాజు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.
హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని. ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారని విమర్శించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ ఎగరేసి జైలుకెళ్లిన రేవంత్‌రెడ్డి ఇపుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని .. సకలం చెరువులో కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. పెద్దోళ్లను కొట్టి చిన్నోళ్లకు ఇవ్వాలని.. తెలిసి తెలియక కొందరు ఇళ్లు కట్టుకుంటే అవి కూల్చేస్తే ఎలా అన్నారు. రైతు రుణమాఫీ రూ. 47వేల కోట్లు చేస్తామని చెప్పి.. రూ. 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని మంత్రి తెలిపారు.