ప్రమాదవశాత్తూ లిప్టులో ఇరుక్కున్న బాలుడు.. చికిత్స పొందుతూ మృతి

నాంపల్లి (CLiC2NEWS): నగరంలోని ఓ అపార్ట్‌మెంట్ లిప్టు లో ప్రమాదవశాత్తూ బాలుడు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్క్ ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. బాలుడు లిప్టుకి, గోడకి మధ్య ఇరుక్కుపోయి.. దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. వెంటే అప్రమత్తమైన అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డిఆర్ ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని దాదాపు 90 నిమిషాలు శ్రమించి బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
తాతతో కలిసి ఆరేళ్ల అర్ణవ్ శుక్రవారం మధ్యాహ్నం మఫర్ కంఫర్ట్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మేనత్త ఇంటికి వెళ్లాడు. తాత చేతిలో లగేజి ఉండటంతో బాలుడు లిప్టు గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. తాత లగేజి పెట్టేలోపే లిప్టు ఒక్కసారిగా పైకి వెళుతుండటంతో భయంతో బాలుడు బయటకి వచ్చేందుకు ప్రయత్నించడంతో.. లిప్టుకు, గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోయాడు. కదిలే వీలు లేక లిప్టు గ్రౌండ్ ఫ్లోర్‌కు, మొదటి అంతస్తుకు మధ్య లిప్టు ఆగిపోయింది. అపార్ట్‌మెంట్ వాసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి.. పోలీసులకు సమాచారం అందించారు. లిప్టు గోడలను బద్దలు కొట్టి.. అతికష్టంమ్మీద బాలుడిని బయటకు తీసు నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.