ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కెసిఆర్

ములుగు (CLiC2NEWS): ప్రజాతీర్పును గౌరవిద్దామని, అదేవిధంగా కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలకు కెసిఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి, ప్రజాసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిద్దామన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 64 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కెసిఆర్ ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష కోసం పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని ఆయన పార్టీ నేతలతో అన్నారు.