ఎపిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు

శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు..

మండపేట (CLiC2NEWS): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని.. ఈ పరిణామాలు ప్ర‌జ‌లంద‌రూ గమనిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనాగ్రహ దీక్ష చేపట్టారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు మస్తిష్కంలో పుట్టలు కొద్దీ దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని అవి ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ తన తాబేదారు పట్టాభి చేత విషం చిమ్మిస్తున్నారని అన్నారు. ఇదే విధంగా గతంలో కుటిల రాజకీయాలు చేసి మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసని వ్యంగ్రాస్త్రాలు సంధించారు. బాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితం వెన్నుపోటు పొడవడానికి బాగా ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా అవమానించి ఇంట్లో కూర్చోపెడితే అది తట్టుకోలేని చంద్రబాబు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు భారీ విజయం అందించి 175 స్థానాలతో ముఖ్యమంత్రిని చేస్తే అలాంటి వ్యక్తి మీదే అనరాని మాటలు ఆడిస్తే ప్రజలు తట్టుకోలేరని అన్నారు. ముఖ్యమంత్రిని నిందిస్తే ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక్కోసారి ప్రజాగ్రహం చవి చూడక తప్పదని హెచ్చరించారు.

ప్రతిపక్ష పార్టీగా ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యల కోసం ప్రస్తావిస్తే ప్రజలు హర్షిస్తారే తప్ప నీవు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎవరూ చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే అది చూసి తట్టుకోలేక కడుపు మంటతో తమ నాయకుడిపై కుట్రలు పన్నితే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరన్న విషయం చంద్రబాబు గ్రహిస్తే మంచిదని అన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బ్రష్టు పట్టుకుపోయిందని ఇదే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తే ప్రజలు అధఃపాతాళానికి తొక్కేయడం ఖాయమని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సరైన నాయకుడు అయితే పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు తక్షణం చర్యలు తీసుకొని టీడీపీ నుండి సాంఘిక బహిష్కరణ చేసే వారని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా చర్యకు ప్రతి చర్య ఉంటుందని అందులో భాగమే ఈ పరిణామాలు అని తెలిపారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తమ నాయకులను అదుపులో పెట్టుకుని ప్రజాక్షేత్రంలో ఏవిధంగా మసులుకోవాలో నేర్పి ప్రజల అభిమానం పొందాలన్నారు. ఇలాంటి పనులు చేస్తే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పక్కదారి పడతాయి అన్న భ్రమలో బాబు ఉన్నారని అలాంటివేమీ జరగవని చెప్పారు.

పాపారాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పట్టాభి వాడిన పదజాలం క్షమించరానిదని పేర్కొన్నారు. అటువంటి నీతిమాలిన వ్యక్తికి చంద్రబాబు వెన్నుదన్నుగా నిలవడం గర్హనీయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విధానాలను నారా లోకేష్ కూడా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది తగదని అన్నారు.

రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ.. పట్టాభి అనే వ్యక్తి ఇప్పటి వరకూ ఎక్కడున్నాడో మూడు సంవత్సరాల వరకూ ఎవరికీ ఇతనెవరో తెలీదని అన్నారు. టీడీపీ కార్యాలయంలో కూర్చొని రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన వ్యక్తులను అసభ్య పదజాలంతో దూషించడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.