ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: జలమండలి ఎండీ దానకిశోర్

మొదటిరోజు 563 ఫిర్యాదులు.. 85 శాతం పరిష్కారం
క్షేత్రస్థాయిలో 594 మంది సిబ్బంది
64 మినీ ఎయిర్‌టెక్, 26 ఎయిర్‌టెక్ మిషన్లు సిద్ధం
హైదరాబాద్ (CLiC2NEWS): నేటి నుంచి(01.10.2021) జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల సీవరేజి నిర్వహణ బాధ్యతలను జలమండలి చేపట్టింది. జీహెచ్ఎంసీ నుంచి సీవరేజి నిర్వహణకు సంబంధించిన యంత్రాలు, వాహనాలు, కార్మికులను జలమండలి తన పరిధిలోకి తీసుకుంది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేస్తున్న జలమండలి నేటి నుంచి సీవరేజి నిర్వహణ చేపట్టింది.
ఈ సందర్భంగా శివారు మున్సిపాలిటీల పరిధిలోని జలమండలి సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో శుక్రవారం సాయంత్రం జలమండలి ఎండీ దానకిశోర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ… శివారు మున్సిపాలిటీల సీవరేజికి సంబంధించి మొదటి రోజు వివిధ మాధ్యమాల ద్వారా దాదాపుగా 563 ఫిర్యాదులు అందాయని, ఈ సాయంత్రం వరకు సుమారు 85 శాతం పరిష్కరించామని, మిగతావి పురోగతిలో ఉన్నట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు.
గురువారం సాయంత్రం నాటికే జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి సీవరేజి నిర్వహణకు సంబంధించిన బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే జలమండలి అధికారులు, సిబ్బంది సామాగ్రితో సన్నద్ధమై క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని ఎండీ పేర్కొన్నారు. మొత్తం 594 మంది పారుశుద్ధ్య సిబ్బంది, 64 మినీ ఎయిర్‌టెక్ యంత్రాలు, 26, ఎయిర్‌టెక్ యంత్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే, పారిశుద్ధ్య పనులు చేపట్టే కార్మికుల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకోసం గమ్ బూట్లు, గ్లౌజులు, సేఫ్టీ బెల్టులు, గ్యాస్ మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, హెల్మెట్, యూనిఫార్మ్, తదితర సామాగ్రి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
కార్మికులు పని చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు, సామాగ్రిని సమకూర్చినట్లు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే, మ్యాన్‌హోళ్లు శుభ్రం చేసేటప్పుడు, మరమ్మత్తులు చేసేటప్పుడు తప్పనిసరిగా చుట్టూ బ్యారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఎండీ అధికారులకు సూచించారు.
7 నుంచి 11 గంటల వరకు క్షేత్రస్థాయిలో ఉండాలి
రేపటి నుంచి ప్రతీ రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జలమండలి సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన హాట్‌స్పాట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.
సమస్యలపై ఫిర్యాదుకు 155313కి ఫోన్ చేయండి
శివారు ప్రాంత ప్రజలు మంచినీటి సరఫరాతో పాటు సీవరేజి సమస్యలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జలమండలి ఎండీ తెలిపారు. అలాగే, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో నమోదయ్యే మంచినీరు, సీవరేజి సమస్యలను సైతం జలమండలి పరిష్కరిస్తుందని తెలిపారు. ఎక్కడైనా సీవరేజి సమస్యలు ఉత్పన్నమైతే సమీపంలోని జలమండలి సెక్షన్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు