CoronaAlert: మరింత జాగ్రత్తగా ఉండాలి..
ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గత వారం రోజులుగా పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. అయితే కరోనా నివారణకు వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ కోఠీలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.
ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చేది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జాగ్రత్తల విషయంలో ప్రజల్లో అలసత్వం పనికి రాదు అన్నారు. రాష్ర్టంలో కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. పాజిటివ్ కేసుల్లో 80 -90 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదు. కేవలం 10 శాతం మందికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 95 శాతం వరకు రికవరీ రేటు ఉందన్నారు. మొదటి దశలో దేశంలోనే అత్యధికంగా 99.5 శాతం రికవరీ రేటు మనది అని పేర్కొన్నారు.
కరోనా లక్షణాలు లేకుండానే పరీక్షల కోసం వస్తున్నారు. అలా వచ్చి సగం మంది కరోనాను అంటించుకుని వెళ్తున్నారు. కొందరు వారంలో రెండుసార్లు పరీక్షలకు వస్తున్నారు. ఈ క్రమంలో నిజంగా పరీక్షలు, చికిత్స కావాల్సిన వారికి అందడం లేదు. లక్షణాలు కనిపించినప్పుడే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రాష్ర్టంలో 50 వేలకు పైగా పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు. 18 వేలకు పైగా ఆక్సిజన్ పడకలు, 10 వేలకు పైగా ఐసీయూ పడకలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పడకలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలోనూ తమ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చాం.. టీకా వేసుకున్న వారిలో ఎవరూ తీవ్రమైన అస్వస్థతకు గురికాలేదని తెలిపారు. టీకా వేసుకున్న వారికి వైరస్ సోకినా ఆస్పత్రిలో చేరలేదు… టీకీ వేసుకున్న వారిలో 80 శాతం మందికి కొవిడ్ సోకలేదని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని డిహెచ్ వివరించారు.