దళితబంధు సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది
ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధు వర్తింపు : ముఖ్యమంత్రి కెసిఆర్
హుజురాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర సర్కర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన కరీంనగర్‌లోనే జరిగిందని గుర్తు చేశారు సిఎం.
మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సిఎం తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం పథక అమలు తీరును వివరించారు.
ముఖ్యమంత్రి మాటల్లోనే..
‘హుజూరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలి. 25 ఏండ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ప్రారంభించాం. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాటలు రూపొందించాం. 25 ఏండ్ల నుంచి నా మస్తిష్కంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణగారిన, అణిచివేయబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయి. అంబేద్కర్ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయి.’
అని ముఖ్యమంత్రి అన్నారు.
`అయినా ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలి. ఇవాళ తెలంగాణ నుంచి చేసే పని దేశమంతా వ్యాపించాలి. ఇవాళ మేం చేస్తమంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. రెండు నెలల్లో హుజూరాబాద్‌లో పథకం అమలవుతుంది. మిగతా నియోజకవర్గాల్లో హుజూరాబాద్ దళితులే ఆదర్శం కావాలి. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. రైతుబంధు తరహాలోనే దళిత బంధు వస్తది. గవర్నమెంట్ ఉద్యోగులైన దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది.’
అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
‘ఒకాయనకు 4 ఎకరాల భూమి ఉంటే రైతుబంధు వస్తున్నది. రైతుబంధు లాగే దళిత బంధు వర్తిస్తుంది. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివరి వరుసలో ఉండి తీసుకోవాలి. మన దళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయి. అటువంటి వారికి మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ పోతాం. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇచ్చే హామీ నాది. రెండు పూటలు పస్తులుండే వాళ్లు లక్షల మంది ఉన్నారు. వారు ముందుగా తీసుకోవాలి. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలే. 75 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలే. ఇది ప్రజాస్వామ్యం అయితే ప్రజలు ప్రభువులు అయితే దళితులు ఎందుకు ప్రభువులుగా లేరు. ఈ వివక్ష ఎన్ని శతబ్దాలు కొనసాగలే. ఇది ఉండకూడదు.’
అని ముఖ్యమంత్రి చెప్పారు.
విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే..
దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళిత బంధును విజయం సాధించితీరుతది. నిన్ననే 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చేయలేదు. ఈ పథకం ఏడాది కిందనే మొదలుకావాలి. కానీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వలేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. దళితులు బాగుపడొద్దా. ఎవరెవరకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతకు మనవి చేస్తున్నా. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత మీ మీదనే ఉంది’ అని సీఎం తెలిపారు.
మరో రూ.2వేల కోట్లు
హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్నట్లు లెక్క ఉన్నది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది. రూ.500 కోట్లు ఇచ్చాం. మిగతావి ఇస్తాం. రాబోయే 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు ఇస్తాం. ఈ డబ్బుతో అందరూ ట్రాక్టర్లే కొనొద్దు. ఇది విజయవంతం కావాలంటే అందరం ఒకటే పని చేయొద్దు. ఈ స్కీంకు బ్యాంకులకు లింకేజీ ఉండదు. కిస్తీలు కట్టే కిరికిరి లేదు. బాకీ ఇవ్వాలనే బాధ లేదు.’ అని అన్నారు.
`దళిత బంధు డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తాం. రూ. 10 లక్షలతో వచ్చే ఏడాది కల్లా రూ. 20 లక్షలు సంపాదించుకోవాలి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తం. లైసెన్సింగ్ దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తాం. దళితబంధు దేశవ్యాప్తంగా సంచలం సృష్టిస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ దళితబంధుపై చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మహోన్నత ఉద్యమం అవుతుంది.“ అని ముఖ్యమంత్రి తెలిపారు.