ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్ (CLiC2NEWS): వైద్య ఆరోగ్య శాఖలోఎన్ హెచ్ ఎం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అరకొర వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయిస్తుందని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ ఆరోపించారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు పదో పిఆర్సి లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 510 జీఓ ప్రకారం నాలుగు వేల మంది ఉద్యోగులకు పీఆర్సీ అమలు కాకపోగా 11వ పిఆర్సి లోను వారికి వర్తింప చేయలేదన్నారు. వైద్య శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉన్న ఉద్యోగుల పైనే పని భారాన్ని మోపుతున్నారన్నారు. దీంతో ఉద్యోగుల పై రోజురోజుకు పని భారం పెరుగుతుందని దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రణిత, పుష్ప, జ్యోతి , శృతి , తులసి, విష్ణు , అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.