యూట్యూబ్ చూసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు..
బాపట్ల (CLiC2NEWS): యూట్యూబ్ చూసి దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకిలో చోటుచేసుకుంది. యూట్యూబ్ చూసి బుల్లెట్ బైక్‌ల తాళాలు ఎలా తీయాలో నేర్చుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అద్దంకిలో 9 కేసులు, నరసరావుపేటలో 1, మద్దిపాడులో 1, చిలకలూరి పేటలో 2, జె. పొగులూరులో 2 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా బుల్లెట్ వాహనాలే చోరీకి గురవడంతో పోలీసులు తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 16 బుల్లెట్ బైక్‌లు , ఒక స్కూటీని అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటి విలువ సుమారు రూ.25 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఆ బైక్‌లను విక్రయించేందుకు సిద్దంగా ఉన్న సమయంలో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
