రాష్ట్రపతి రేసుకు నో చెప్పిన ఫరూఖ్ అబ్దుల్లా..
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/Farooq-Abdullah.jpg)
న్యూడిల్లీ (CLiC2NEWS): దేశంలోని విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ఒక్కటవుతోన్న వేళ వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా నిరాకరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని ఫరూఖ్ వెల్లడించారు.
“రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ నా పేరును ప్రతిపాదించడం సంతోషంగా ఉంది. ఆ తర్వాత చాలా మంది విపక్ష నేతలు నాకు మద్దతు తెలిపారు. ఈ విషయం నాకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. ఈ ప్రతిపాదనపై నేను మా పార్టీ సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించాను.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి జమ్మూ కాశ్మీర్‌ను బయటపడేసేందుకు నా వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను క్రియాశీలక రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా.. అందువల్ల నేను రాష్ట్రపతి రేసు నుంచి నా పేరును ఉపసంహరించుకుంటున్నా.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి నా మద్దతు ఉంటుంది..“ అని ఫరూఖ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇటీవల బెంగాల్ సిఎం మమత నేతృత్వంలో విపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే . ఈ సమావేశంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు.