పెదకాకాని శివారు గోశాలలో నలుగురు మృతి

గుంటూరు (CLiC2NEWS): జిల్లా పెదకాకాని శివారులో ఉన్న శ్రీకాళీ వనాశ్రమం (గోశాల) లో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వారిని విద్యుత్ బలి తీసుకుంది. విద్యుదాఘాతానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు .. గోశాల నుండి నిత్యం వచ్చే పేడ , వ్యర్థాలను సేకరించి , సంపుల్లో వేసి మోటార్ల సహాయంతో పొలాల్లోకి పంపుతారు. సంపుల్లో గట్టిపడ్డ పేడను రెండు లేదా మూడు రోజులకోసారి వైబ్రేటర్ సాయంతో కలియబెడతారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే మహంకాళిరావు సోమవారం సాయంత్రం వైబ్రేటర్ మిషన్తో సంపులోకి దిగారు. వైబ్రేటర్ విద్యుత్తు తీగ తెగి షాక్ కొట్టగా.. మహంకాళిరావు కేకలు వేశారు. దీంతో కేకలు విన్న రాజేశ్ మహంకాళిరావు ఉన్న సంపులోకి దిగాడు. అతనికి కూడా షాక్ కొట్టడంతో సంపులో పడిపోయాడు. అనంతరం ఇంకొకరు ఏటగిరి బాలయ్య .. మందాడి శివరామ కాళిబాబు ఒకరి తర్వాత ఒకరు సంపులో పడిపోయారు.
వీరందరూ పైకి రాకపోయేసరికి అనుమానించిన జీవన్ అనే వ్యక్తి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. స్థానికులకు , పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వైబ్రేటర్ తీగ తెగడం వలనే ప్రమాదం జరిగినట్లు తేల్చారు. క్షణాల వ్యవధిలో నలుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ వాతావరణమంతా విషాదంతో నిండిపోయింది.