హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్

హైద‌రాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని ఆ పార్టీ ఖ‌రారు చేసింది. టిఆర్ ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర‌ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ఖ‌రారు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ శాసన స‌భ స్థానానికి త్వ‌ర‌లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ద‌ళిత బంధు ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ ప‌రిచ‌యం చేయ‌నున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు గులాబీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గ్రామానికి చెందిన గెల్లు మ‌ల్ల‌య్య‌, ల‌క్ష్మీ దంప‌తుల‌కు శ్రీనివాస్ యాద‌వ్.. 1983, ఆగ‌స్టు 21న జ‌న్మించారు. ఉస్మానియా వ‌ర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే యూనివ‌ర్సిటీలో రాజ‌నీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.