శ్రీ కన్వెన్షన్ ప్రారంభించిన ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్
గోదావరి జిల్లాలలో త్రీ స్టార్ సౌకర్యం

మండపేట (CLiC2NEWS): రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ బొమ్మూరు రోడ్డు లోని నామవరం గ్రామంలో త్రీస్టార్ రిసార్ట్స్ కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలలో గ్రామీణ వాతావరణంలో అతిపెద్ద త్రీస్టార్ రిసార్ట్ ను మండపేట ప్రముఖులు సర్జన్ డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ దంపతులు ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. బుధవారం కేశవరం బొమ్మూరు రోడ్డు లోని నామవరం గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన త్రీస్టార్ రిసార్ట్స్ కన్వెన్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో అతిపెద్ద కన్వెన్షన్ హాల్ గా శ్రీ కన్వెన్షన్ ఉంటుందన్నారు. ఈ కన్వెన్షన్ హాల్ లో ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, సెలూన్ స్ఫా, స్కైలైన్ మినీ ఫంక్షన్ హాల్, లగ్జరీ షూట్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, హనీమూన్ షూట్స్, అరోమా రెస్టారెంట్, శతమానంభవతి ఫంక్షన్ హాల్, ఫంక్షన్ డైనింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ఆర్యో హోటల్ కాఫీ షాప్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాటిని ఏర్పాటు చేయడం చాలా అరుదైన విషయమన్నారు. రాష్ట్రంలో టూరిజం మరింతగా అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రముఖ పుణ్య క్షేత్రాలే కాకుండా ప్రసిద్ధ టూరిజం హబ్ గా ఉందన్నారు.
ఫంక్షన్ డైనింగ్ హాల్ ను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ బిక్కిన గోపాలకృష్ణ మండపేట పరిసర ప్రాంతాలకు ప్రజలకు వైద్య సేవలు అందించడమే కాకుండా టూరిజంలో ప్రవేశించి మరిన్ని సేవలను అందించడం చాలా అరుదైన విషయం అన్నారు. హనీమూన్ షూట్ ను ప్రారంభించిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. సేవాతత్పరత కలిగిన బిక్కిన గోపాలకృష్ణ పారిశ్రామిక రంగంలో కూడా ప్రవేశించి తన సమర్థతను చాటు కోవాలన్నారు.
కార్యక్రమంలో మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలా రెడ్డి, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకరరావు, మండపేట మున్సిపల్ కౌన్సిలర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, రెడ్డి రాధాకృష్ణ, రాజోలు మాజీ సర్పంచ్ నక్కా రాజబాబు, ఇంజనీర్ రాకుర్తి సత్యనారాయణ, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు వల్లూరి చిన్నారావు, వర్రే సత్యనారాయణ, కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయిబాబా, మాజీ కౌన్సిలర్ చుండ్రు రాంబాబు, మల్లిపూడి గణేశ్వరరావు, మండపేట, రామచంద్రపురం, అనపర్తి, రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.