GoodNews: డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్: కేంద్ర మంత్రి జావ్డేకర్

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. సువిశాల భారతదేశంలోని అతి పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు ఎప్పుడు వ్యాక్సినేషన్ పూర్తవుతుందా అనే అనుమానం ప్రజలందరికీ ఉంది. ప్రస్తుతం కొవిడ్ దేశంలో విజృంభిస్తున్న తరులణంలో కేంద్రం శుభ వార్త చెప్పింది. ఈ యేడాది డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జావ్డేకర్ వెల్లడించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి 130 రోజులైంది. అయితే ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణలో టీకాలే కీలకమని అందరూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్‌లో 20 కోట్ల మైలురాయిని అందుకున్న రెండవ దేశంగా ఇండియా నిలిచింది. ఈ ఘనతను కేవలం అగ్రరాజ్యం అమెరికా మాత్రమే చేరుకున్నది.
శుక్రవారం ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ పైర్ అయ్యారు. 130 కోట్ల మంది జనాభాలో కేవలం 3 శాతం మందికి మాత్రమే టీకాలు ఇచ్చినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. సెకండ్ వేవ్ విజృంభించడానికి మోదీయే కారణమని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చిన జవదేకర్ మాట్లాడుతూ.. 2021 లోపే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఇక, వ్యాక్సిన్లపై రాహుల్ గాంధీ ఆందోళన చెందితే… ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ గందరగోళంగా సాగుతోందని ఆరోపించిన కేంద్ర మంత్రి… 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను కూడా వాళ్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ ను వృధా చేస్తున్నాయని కూడా ఆరోపించింది.