తెలంగాణపై గులాబ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌!

హైదరాబాద్‌ (CLiC2NEWS): ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేసిన గులాబ్‌ తుపాను కొద్ది గంటలు ముందుగానే ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ శాఖ తుఫాను ప్ర‌భావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్‌ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్‌ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నదని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో ఈశా న్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని పేర్కొన్నది.

భారీ వర్షాలు

నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, వరంగల్‌, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

కంట్రోల్‌ రూమ్ ల ఏర్పాటు

తుఫాన్‌ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రతి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌అలర్ట్‌, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌గా ప్రకటించినట్టు తెలిపారు.

2 Comments
  1. Akhil banothu says

    Who mane days rani

    1. admin says

      3 days.. but not confirm

Your email address will not be published.